విషాదం: సీనియర్ నటి విజయ భాను ఇక లేరు

విషాదం: సీనియర్ నటి విజయ భాను ఇక లేరు

Published on Jun 7, 2025 7:59 PM IST

సినిమాలో విజయ భాను అనే పేరుతో ఒక నటీమణి ఉండేవారని, తెలుగు సినిమా రంగంలో విజయపతాకం ఎగురవేయడమే కాకుండా… తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించారని ఈతరం వారికి తెలియకపోవచ్చు. కానీ 70వ దశకంలో ఒక వెలుగు వెలిగి అప్పటి అగ్ర కథానాయకులందరి సినిమాల్లోనూ నటించారు విజయభాను. ముఖ్యంగా అప్పట్లో “రాజబాబు – విజయభాను” జంటకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేదని చెబుతారు.

కేవలం పదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా సినిమాలు చేసి ఆశ్చర్యపరిచిన ఈ సీనియర్ నటి తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి అప్పట్లోనే “పాన్ ఇండియా పాపులర్ యాక్ట్రెస్”గా పేరు గడించిన విజయభాను ఇటీవల ఇండియాకు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్లకుండా తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. 68 ఏళ్ల విజయ భానుకి ఉన్న ఏకైక కుమార్తె అమెరికాలోని ఓ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అనంతపురం విజయభాను స్వస్థలం. అయితే ఆమె పుట్టింది, పెరిగింది, పేరు తెచ్చుకుంది చెన్నైలోనే.

స్వతహా నాట్యకారిణి కావడంతోపాటు…”నాట్యమయూరి” బిరుదాంకితురాలైన విజయభాను…లాస్ ఏంజెల్స్ లో “శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్” పేరుతో నృత్య కళాశాల స్థాపించి, వేలాది మందికి తర్ఫీదు ఇచ్చారు. మన భారతీయ నాట్యకళలైన “భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకేళి” వంటి అన్ని నృత్యరీతులలోనూ నిష్ణాతురాలైన విజయభాను ప్రపంచవ్యాప్తంగా లెక్కకుమిక్కిలిగా నాట్య ప్రదర్శనలు ఇచ్చి ఉండడం విశేషం. మన తెలుగు సినిమా రంగం నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎవరు వెళ్లినా… విజయ భాను ఎంతో ఆత్మీయంగా ఆతిధ్యమిచ్చేవారు.

మెగాస్టార్ చిరంజీవి, యూనివర్సల్ హీరో కమల్ హాసన్, జయసుధలతో కె. బాలచందర్ తెరక్కించిన దృశ్యకావ్యం “ఇది కథ కాదు” చిత్రలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్న విజయభాను, ఆ చిత్రంలో కనబరిచిన అత్యుత్తమ నటనకు “ఉత్తమ సహాయ నటి”గా నంది పురస్కారం అందుకున్నారు. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా “నాట్యమయూరి” బిరుదునూ అందుకున్నారు. “నిప్పులాంటి మనిషి (ఎన్ఠీఆర్), ఇది కథ కాదు (చిరంజీవి – కమల్ హాసన్), కిలాడి బుల్లోడు (శోభన్ బాబు), ఒక నారి వంద తుపాకులు (విజయ లలిత), చందన (హీరోగా రంగనాద్ మొదటి చిత్రం),, ప్రియబాంధవి (శారద), స్త్రీ (కృష్ణంరాజు), శభాష్ పాపన్న (జగ్గయ్య), చిన్నికృష్ణుడు” (జంధ్యాల – ఘట్టమనేని రమేష్ బాబు) తదితర చిత్రాలు విజయభాను పేరు ఆరోజుల్లో మారుమ్రోగేలా చేశాయి!!

విజయభాను ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ కథానాయకి – మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద, ప్రముఖ నటులు సుమన్, ప్రముఖ దర్శకనిర్మాత వై.వి.ఎస్.చౌదరి తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు