హీరో రామ్ పోతినేని తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో తన జీవితానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’కు రామ్ అతిథిగా వచ్చారు. రామ్ పోతినేని మాట్లాడుతూ.. ‘నా గురించి ఈ విషయాలు చాలామందికి తెలియవు. అమ్మ వాళ్లది హైదరాబాద్ కావడంతో నేను ఇక్కడే పుట్టాను. తర్వాత విజయవాడ వెళ్లాం. 1988లో విజయవాడలో కుల ఘర్షణలు చాలా జరిగాయి. ఆ ఘర్షణల్లో మా కుటుంబం అప్పటివరకు సంపాదించిందంతా కోల్పోయింది. ఒక్క రాత్రిలో జీరోకు వచ్చేశాం’ అని రామ్ తెలిపారు.
రామ్ పోతినేని ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో మా నాన్న ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. ఎంత కోల్పోయామనే దానికి ఉదాహరణ కూడా చెబుతాను. విజయవాడలో నా బొమ్మల కోసం ఒక పెద్ద గది ఉండేది. తర్వాత మేం చెన్నైకు మారినప్పుడు మా ఇల్లు మొత్తం కలిపినా నా బొమ్మల గదిలో సగం కూడా లేదు. అంత పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది. అన్ని కష్టాలు పడి మా నాన్న మమ్మల్ని పెంచారు’ అంటూ రామ్ పోతినేని చెప్పుకొచ్చారు.