సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హవా ఈమధ్య కొద్దిగా తగ్గింది. చేసిన కొన్ని సినిమాలు పరాజయం చేందడంతో కెరీర్ స్లో డౌన్ అయింది. అలాగే బాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో తెలుగులో కూడ పెద్దగా సినిమాలకు సైన్ చేయలేదు. ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమాలో కథానాయకిగా నటిస్తోంది రకుల్. అలాగే నితిన్, చంద్రశేఖర్ ఏలేటిల ‘చెక్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే శంకర్ యొక్క ‘ఇండియన్ 2’లో ఇక కీలక పాత్ర చేస్తోంది. బాలీవుడ్లో తాజాగా ‘మే డే’ సినిమాకు సైన్ చేసింది.
ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పైలెట్ పాత్రలో నటించనుంది. అజయ్ దేవగన్ సరసన ఆమె నటించడం ఇది రెండోసారి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘దే దే ప్యార్ దే’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక కీ రోల్ చేయనున్నారు. ఆయనతో నటించడం రకుల్ కు ఇదే మొదటిసారి. అందుకే సినిమా పట్ల ఎక్కువ ఎగ్జైట్ అవుతోంది ఆమె. ఈ సినిమాకు నిర్మాత కూడ అజయ్ దేవగనే. డిసెంబర్ నుండి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ మద్య నుండి రకుల్ షూటింగ్లో జాయిన్ కానుంది.