గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం డిజాస్టర్ అయిన తర్వాత ఆ చిత్ర హీరో గాని, దర్శకుడు శంకర్ గాని తమకు ఫోన్ చేయలేదని నిర్మాతల్లో ఒకరైన శిరీష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరు సరికొత్త వివాదానికి దారితీసింది. మెగా ఫ్యాన్స్ వర్సెస్ దిల్ రాజు అనే రేంజ్‌లో ఈ వార్ సోషల్ మీడియాలో సాగుతోంది. ఇక దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ చిత్ర రిలీజ్ సమయంలో ఈ వివాదం చెలరేగడంతో దిల్ రాజు అప్రమత్తం అయ్యారు.
ఆయన ఇప్పటికే తన ఇంటర్వ్యూల్లో శిరీష్ చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా మెగా ఫ్యాన్స్ తమ బ్యానర్‌ను టార్గెట్ చేస్తుండటంతో మరో నిర్మాత శిరీష్ తాజాగా స్పందించారు. ఆయన మెగా ఫ్యాన్స్‌కు ఓపెన్ లెటర్ రాశారు. తాను మాట్లాడిన మాటలు అపార్థాలకు దారి తీస్తున్నాయని.. మెగా ఫ్యాన్స్ ఈ మాటలతో బాధపడుతున్నారని తనకు తెలిసిందని.. గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తమకు పూర్తి సమయం, సహకారం అందించారని.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడమని.. తన కామెంట్స్ ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు శిరీష్ తాజాగా ఈ ఓపెన్ లెటర్‌లో పేర్కొన్నారు.
ఇక ఈ లెటర్‌తో మెగా ఫ్యాన్స్‌తో వివాదానికి శిరీష్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా మెగా ఫ్యాన్స్ ఈ వివాదానికి చెక్ పెడతారేమో చూడాలి.