తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’ తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బాగానే పేరు తెచ్చుకున్నాడు. అయితే తన తరువాత సినిమాని మురగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ తో చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో హీరోయిన్ గా సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ను తీసుకుంటున్నారని తెలుస్తోంది.
కాగా సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ఈ యంగ్ బ్యూటీకి, ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేవు, నిజానికి మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చినా, భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసేసరికి ఆఫర్లు దూరమైపోయాయి. మొత్తానికి విక్రమ్ కుమారుడి సినిమాలో ఈ సోషల్ మీడియా బ్యూటీకి ఛాన్స్ వచ్చింది. అన్నట్లు ప్రియా ప్రకాష్ వారియర్ కి నితిన్ – యేలేటి చేయబోయే కొత్త సినిమాలో రెండో కథానాయకిగా ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో ఇంకా క్లారిటీ లేదు.