‘అత్తారింటికి దారేది’ ప్రొడక్షన్ టీం బాగా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేస్తున్న ‘థాంక్యూ మీట్’ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఈ వేడుక ఆదివారం నాడు శిల్పకళావేదికలో జరగనుంది, ఈ వేడుకలో అభిమానులు కూడా పాలుపంచుకోనున్నారు. మాములుగా ఇలాంటి మీట్స్ కి దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలియడంతో పవన్ అభిమానుల్లో ఆనందోత్సాహం నెలకొంది.
ఈ సమాచారాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ అధికారికంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసారు. ‘ పైరసీని వ్యతిరేకించి, అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఈ సంఘటన తెలుగు వారి నిజాయితీని చాటి చెప్పింది. ఇలాంటి ఘోరమైన సందర్భంలో నాతో పాటే ఉన్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లకి నా ధన్యవాదాలు. వాళ్ళిద్దరూ నన్ను తమ సొంత తండ్రిలా చూసుకున్నారు. అది నేను మర్చిపోలేనని’ బివిఎస్ఎన్ ప్రసాద్ అన్నాడు.
ఈ ప్రెస్ మీట్ కి అలీ, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, బాపినీడు, బివిఎస్ఎన్ ప్రసాద్, ప్రసాద్ మూరెళ్ళ తదితరులు హాజరయ్యారు. సినిమా ఇంతటి విజయం సాధించినందుకు వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుతం అత్తారింటికి దారేది సినిమా అన్ని ఏరియాల్లో బాక్స్ ఆఫీస్సు వద్ద కలెక్షన్లు కొల్లగొడుతూ విజయవంతంగా దూసుకుపోతోంది.