ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAI) ఆధ్వర్యంలో తొలిసారిగా జరగబోయే ఆర్చరీ ప్రీమియర్ లీగ్(APL)కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ లీగ్ అక్టోబర్ 2 నుంచి 12 వరకు న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనుంది. ఇండియాలో తొలిసారిగా ఫ్రాంచైజీ ఆధారంగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో దేశీయ, అంతర్జాతీయంగా అగ్రశ్రేణి రికర్వ్ మరియు కాంపౌండ్ ఆర్చర్లు పాల్గొంటారు.

మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లతో జరగబోయే ఈ పోటీల్లో 36 మంది భారత అగ్రశ్రేణి ఆర్చర్లు, 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు (టాప్-10 దేశాల ఆటగాళ్లు సహా) పాల్గొంటారు. రికర్వ్ మరియు కాంపౌండ్ ఆర్చర్లు ఒకే వేదికపై లైట్స్ కింద పోటీపడటం ఈ లీగ్ ప్రత్యేకత.

ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ఆర్చరీ అంటే క్రమశిక్షణ, ఏకాగ్రత, సహనం. ఇవన్నీ నాకు దగ్గరగా ఉన్న విలువలు. భారత ప్రతిభకు ప్రపంచ స్థాయి వేదికను ఇచ్చే ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ లో భాగం కావడం గర్వంగా ఉంది. ఈ ప్రయత్నం తదుపరి తరం ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను” అని అన్నారు.

ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అర్జున్ ముండా మాట్లాడుతూ.. “భారత గ్రామాల్లో ప్రతి యువ ఆర్చర్ కలలుగన్న కలను నెరవేర్చడానికి ఈ లీగ్ ఒక కీలక దశ. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేరడం మా లక్ష్యాన్ని మరింత బలపరుస్తుంది” అని అన్నారు.

AAI సెక్రటరీ జనరల్ వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ.. “ఇతర క్రీడల లీగ్స్ ప్రేరణతో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వస్తుంది. ఇది కేవలం లీగ్ మాత్రమే కాదు, భారత్ ఒలింపిక్ కలను నెరవేర్చే తొలి అడుగు.” అని అన్నారు.

ఈ లీగ్‌కు వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా, భారత క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ప్రోత్సాహం లభిస్తుండడం తో అందరి చూపులు ఇప్పుడు APLపై ఉన్నాయి.

Exit mobile version