ఓటీటీ సమీక్ష : ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

The-Bads-of-Bollywood

విడుదల తేదీ : సెప్టెంబర్ 18, 2025

స్ట్రీమింగ్‌ వేదిక : నెట్‌ఫ్లిక్స్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : లక్ష్య లల్వాని, బాబీ డియోల్, సహర్ బంబా, రాఘవ్ జుయాల్, అన్య సింగ్, అర్షద్ వార్సి తదితరులు
దర్శకుడు : ఆర్యన్ ఖాన్
నిర్మాత : గౌరీ ఖాన్
సంగీతం : శశ్వత్ సచ్‌దేవ్, అనిరుధ్ రవిచందర్, ఉజ్వల్ గుప్తా
సినిమాటోగ్రఫీ : జేయ్ పినాక్ ఓజా
ఎడిటింగ్ : నితిన్ బెయిడ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా తెరంగేట్రం చేస్తూ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఆస్మాన్ సింగ్(లక్ష్య లల్వాని) బాలీవుడ్‌లో ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నిస్తుంటాడు. తన తొలి చిత్రం ‘రివాల్వర్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంటాడు. ఆ తర్వాత అతడికి వరుస ఆఫర్స్ వస్తుంటాయి. అయితే, ఆయన తీసుకున్న నిర్ణయం అతడి జీవితంలో ఎలాంటి కష్టాలను తీసుకొచ్చింది..? అనేది ఈ సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ తన తొలి ప్రయత్నంలోనే మెప్పించాడు. ఒక కొత్త దర్శకుడు ఈ కథను తెరకెక్కించాడనే భావన కలగకుండా చాలా జాగ్రత్త పడ్డాడు బాలీవుడ్ గురించి తెలిసిన వారికి ఈ వెబ్ సిరీస్ ఇట్టే అర్థమవుతుంది. బాలీవుడ్‌ను ఫాలో కాని వారికి వెండితెర వెనకాల ఏం జరుగుతుందో తెలిపే సిరీస్‌గా ఇది కనిపిస్తుంది.

ఈ వెబ్ సిరీస్‌లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మెప్పించే కామెడీ, అబ్బురపరిచే క్యామియో రోల్స్, విజిల్స్ వేయించే డైలాగ్స్ తదితర అంశాలు ఈ సిరీస్‌కు కలిసొచ్చాయి.

కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ ఇందులో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వారిని వారే బట్టబయలు చేసే విధంగా ఈ డైలాగ్స్ ఉండటం విశేషం. ఇక ఇందులో కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. లక్ష్య లల్వాని, రాఘవ్ జుయాల్ ‘కిల్’ చిత్రం తర్వాత కలిసి నటించడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి క్రియేట్ అయ్యింది.

తాను అనుకున్న దానికోసం ఏదైనా చేసే ఆస్మాన్ సింగ్ పాత్రలో లక్ష్య లల్వాని మెప్పించాడు. రాఘవ్ తనలోని కామెడీ సైడ్‌ని పరిచయం చేసి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. బాబీ డియోల్ కూడా తన పాత్రలో మెప్పించాడు. మిగతా నటీనటులు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ వెబ్ సిరీస్ నడుస్తున్న కొద్ది ఒకట్రెండు ఎపిసోడ్స్‌ను ఇంకా బాగా తీసి ఉండాల్సింది అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ, కొందరికీ అవి ఏమాత్రం ఎక్కవు. ఇందులో కొన్ని అడల్ట్ డైలాగ్స్‌తో పాటు కొన్ని సీన్స్ ఈ సిరీస్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దూరం చేస్తుంది.

చివరి ఎపిసోడ్‌లోని విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. హీరోహీరోయిన్ మధ్య రొమాంటిక్ యాంగిల్‌ని కూడా ఇంకా వివరంగా చూపెట్టాల్సింది. ఈ సిరీస్‌కు సంబంధించి ఓ మేజర్ ట్విస్ట్‌ను ఆర్యన్ ఖాన్ ముందే క్లూ ఇస్తాడు. కానీ, చాలా మందికి ఆ ట్విస్ట్ పెద్దగా నచ్చదు. ఈ ట్విస్ట్ ఈ సిరీస్ టైటిల్‌కు యాప్ట్‌గా లేదని ప్రేక్షకులు ఫీల్ అవుతారు.

సాంకేతిక విభాగం :

శశ్వత్ సచ్‌దేవ్ బీజీఎం ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్‌కు బలంగా ఈ బీజీఎం నిలుస్తుంది. పాటల పరంగా కూడా కొంతవరకు మెప్పిస్తాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా చక్కటి ప్రతిభను కనబరిచాడు. ఓ సూపర్ స్టార్ కొడుకు ఇలాంటి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చే సిరీస్‌ను పట్టుకురావడం నిజంగా అభినందనీయం. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ హిందీ సినీ పరిశ్రమకు సంబంధించిన వాస్తవాలను మన కళ్లకు కట్టినట్లు చూపెట్టింది. బయట నుంచి వచ్చిన హీరో బాలీవుడ్‌లో ఎలా నిలదొక్కుకున్నాడు అనేది చక్కగా చూపెట్టారు. స్పెషల్ క్యామియోలు, సెల్ఫ్-రోస్టింగ్ జోక్స్ తదితర అంశాలు మెప్పిస్తాయి. దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న ఆర్యన్ ఖాన్, క్లైమాక్స్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇందులోని అడల్ట్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పించదు. సెటైరిక్ కామెడీని ఇష్టపడేవారు ఈ షోని చూసి ఎంజాయ్ చేస్తారు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version