‘హై సెక్యూరిటీ’ జోన్‌లో కలకలం : ఏకంగా మంత్రి గారి ‘బంగ్లా’లోకి దూరిన చిరుత!

‘హై సెక్యూరిటీ’ జోన్‌లో కలకలం : ఏకంగా మంత్రి గారి ‘బంగ్లా’లోకి దూరిన చిరుత!

Published on Nov 20, 2025 6:56 PM IST

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ‘సివిల్ లైన్స్’ ఏరియాలో గురువారం ఉదయం ఒక చిరుతపులి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. ముఖ్యమంత్రి, గవర్నర్ మరియు ఇతర సీనియర్ మంత్రులు నివసించే ఈ ‘హై సెక్యూరిటీ’ జోన్‌లో చిరుత సంచరించడంతో స్థానికులు మరియు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

మంత్రి గారి ‘బంగ్లా’లో చిరుత

రాజస్థాన్ జలవనరుల శాఖ మంత్రి సురేష్ సింగ్ రావత్ నివసిస్తున్న అధికారిక ‘బంగ్లా’లోకి ఈ చిరుత ప్రవేశించింది. ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో మంత్రి గారి ఇంటి ఆవరణలో చిరుతను చూసిన ‘స్టాఫ్’ భయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. మంత్రి గారి ఇంటికి సరిగ్గా ఎదురుగానే కాంగ్రెస్ సీనియర్ లీడర్ సచిన్ పైలట్ నివాసం కూడా ఉండటం గమనార్హం.

‘స్కూల్’లో విద్యార్థుల భద్రత

మంత్రి గారి ఇంటికి వెళ్లడమే కాకుండా, ఆ చిరుత సమీపంలోని ‘టైనీ బ్లాసమ్ సీనియర్ సెకండరీ స్కూల్’ (Tiny Blossom Senior Secondary School) ఆవరణలో కూడా కనిపించింది. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం, వెంటనే విద్యార్థులందరినీ క్లాస్ గదుల్లోకి పంపి తలుపులు వేసి వారిని సురక్షితంగా ఉంచారు.

ఊపిరి పీల్చుకున్న ‘సివిల్ లైన్స్’

సమాచారం అందుకున్న వెంటనే ‘పోలీస్’ మరియు ‘ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్’ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి, చిరుతను పట్టుకోవడానికి భారీ ‘రెస్క్యూ ఆపరేషన్’ చేపట్టారు. చివరికి దానికి మత్తు మందు (Tranquilizer) ఇచ్చి సురక్షితంగా బంధించారు. ఆ తర్వాత చిరుతను జల్లానా అటవీ ప్రాంతానికి తరలించారు. చిరుత దొరకడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు