ఒక సినిమాని ఎంత కష్టపడి తీసినా దానికి సరైన పబ్లిసిటీ లేకపోతే ఆ సినిమా ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో చేరువకాదు. అందుకే ఈ మధ్య సినిమా పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు. కానీ అలాంటి వాటిని నిలిపివేయాలని మన టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక రూల్ పాస్ చేసింది. ఇక నుంచి పబ్లిసిటీలో భాగంగా పెద్ద పెద్ద హోర్డింగులు మరియు వినైల్స్ లాంటివి నవంబర్ 1 నుంచి పెట్టకూడదు అని, అలాగే రేపటి నుంచి ప్రొడక్షన్ వారు లాలీపప్స్ మరియు బిల్ బోర్డ్స్ మీద ప్రచారం చేయకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి హోర్డింగులకు నిర్మాతలకు అవుతున్న అదనపు ఖర్చులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయం పై పలువురి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నప్పుడు ఒక విషయం తెలిసింది. వారందరీ మాట ఏమిటంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు ఎక్కడా హోర్డింగ్స్ పెట్టకుండా ఆపగలరా? ఒక సీనియర్ ట్రేడ్ విమర్శకుడు మాట్లాడుతూ ‘ ప్రొడక్షన్ వర్గాల వారు ఇలాంటి హోర్డింగ్స్ పెట్టి పబ్లిసిటీకి అనుమతించకపోతే అదే అదునుగా తీసుకుని స్పాన్సర్లు మరియు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మరియు జ్యువెలరీ మాల్స్ వారు ఆ సినిమాకి పబ్లిసిటీ ఇస్తామని తీసుకొని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఆ హోర్డింగ్ కింద వారి కంపెనీని ప్రమోట్ చేసుకుంటారు. చివరిగా ఈ పబ్లిసిటీ ఆపడం కుదరని పని’ అని అన్నారు. బాలీవుడ్ మరియు కోలీవుడ్ పబ్లిసిటీలో ఎంతో ముందంజలో ఉంది. ఒక్క మన టాలీవుడ్ మాత్రమే ఎందుకు ఇలా ఉంది? ఆ రెండు ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మన తెలుగు సినిమాలకు చేసే మార్కెటింగ్ బడ్జెట్ కూడా తక్కువ. ఈ ప్రభావం ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి మరి.