ప్రస్తుతకాలంలో ఓ మధ్య తరగతి ఫ్యామిలీ సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే వారికి చాలా ఖర్చు అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో మల్టీప్లెక్స్‌లో ఓ సినిమా చూడాలంటే ఓ నలుగురు సభ్యుల ఫ్యామిలీకి తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయల ఖర్చు అవుతుంది. ఇక ఇంటర్వెల్ ఖర్చులు అదనం. ఈ విషయంపై చాలా మంది చాలా సార్లు చర్చించారు. కానీ, దీనికి సరైన పరిష్కారం మాత్రం దొరకలేదు.
తాజాగా ఇదే విషయాన్ని హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తావించాడు. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన తాను అక్కడి రేట్లు చూసి అవాక్కయ్యాడట. సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్న విషయాన్ని పక్కనబెడితే, అక్కడ ఇంటర్వెల్‌లో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు చూసి తనకు దిమ్మతిరిగిందని చెప్పాడు. సినిమా టికెట్ కంటే ఎక్కువగా పాప్ కార్న్‌కే డబ్బులు పెట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇలాంటి ధరల వల్ల సామాన్య ప్రేక్షకులు వెండితెరపై సినిమా చూసేందుకు కష్టపడాల్సి వస్తుందని.. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ ఇప్పటికైనా ఈ ధరల నియంత్రణ చేస్తే బాగుంటుందని.. సగటు ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వస్తారని ఆయన తెలిపాడు. ఆయన చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.