అఫీషియల్: ‘అర్జున్ S/O వైజయంతి’గా కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాన్ని NKR21 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే, తాజాగా ఈ చిత్రానికి ‘అర్జున్ S/O వైజయంతి’ అనే టైటిల్‌ను మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. లేడీ పోలీస్ ఆఫీసర్ వైజయంతి పాత్రలో విజయశాంతి ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే తరహా పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఆమె కొడుకు అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించనున్నాడు. స్టైలిష్ లుక్‌తో, తన తల్లితో కలిసి పవర్‌ఫుల్ ఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సోహైల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version