ఇలయదళపతి విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’ విడుదలకు సిద్దమవుతుండటంతో ఆయన నెక్స్ట్ సినిమాపై చర్చ మొదలైంది. మొదటి నుండి విజయ్ 65వ సినిమా దర్శకుల జాబితాలో ఏ.ఆర్. మురుగదాస్ కూడా ఉన్నారు. తాజా సమాచారం మేరకు ఆయనే ఫైనల్ అయ్యారు. ఇటీవలే రజనీతో ‘దర్బార్’ చిత్రం చేసి మంచి విజయాన్ని అందుకుని ఫామ్లోకి వచ్చారు మురుగదాస్. పైగా గతంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన ‘తుపాకి, కత్తి, సర్కార్’ చిత్రాలు భారీ విజయాలుగా నిలిచాయి.
అందుకే వీరిది క్రేజీ కాంబినేషన్ అయింది. ఈ కాంబినేషన్ నాల్గవసారి రిపీట్ కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం కూడా ‘తుపాకి’ తరహాలో ఉంటుందని వినికిడి. ఈ ప్రాజెక్ట్ 2020 ఆగష్టు నుండి మొదలుకానుంది. ఇందులో హీరోయిన్ ఎవరు, సంగీతం ఎవరు అందిస్తారు, ఇతర తారాగణం ఏమిటనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.