యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘మిర్చి’ హంగామా జనవరి మొదటి వారం నుండే మొదలు కాబోతుంది. యంగ్ సంగీత తరంగం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటల విడుదల వేడుక జనవరి 5న జరగనుంది. ప్రభాస్ అభిమానుల మధ్య నానక్ రామ్ గూడా లోని రామానాయుడు సినీ విలేజిలో ఈ పాటల పండుగ జరగబోతుంది. గతంలో ప్రభాస్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వర్షం, పౌర్ణమి, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి మ్యూజికల్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. మిర్చి ఆడియో అదే స్థాయిలో ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. 2013 సంవత్సరంలో వస్తున్న మొదటి ఆడియో ఇదే కావడం విశేషం. రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ మొదటి సినిమా మిర్చి. ప్రమోద్ ఉప్పలాపాటి మరియు వంశి కృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ కథానాయికలుగా నటించారు.