గుడ్ ఫ్రెండ్స్ సినిమా గ్రూప్ బ్యానర్ పై నిర్మించి గత శుక్రవారం విడుదలైన ‘ఈ రోజుల్లో’ చిత్రం హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్లోని ఇతర ఏరియాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ చిత్ర సమీక్షలు బావుందని చెప్పడం, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకోవడంతో ప్రేక్షకులందరి దృష్టి ఈ చిత్రం పై పడింది. ఈ సినిమా చూసిన ప్రతి వారు కూడా బావుందని చెప్పడంతో మౌత్ టాక్ ద్వారా హిట్ టాక్ సంపాదించుకుంది. హైదరాబాదులోని పలు ఏరియాల్లో టికెట్స్ దొరకడం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. హైదరాబాదులోనే కాకుండా మిగతా ఏరియాల్లో కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. 75 లక్షలతో తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ సాంకేతిక విలువలు ఉన్నతంగా ఉండటంతో, 5డి కెమెరాతో తీసి రామ్ గోపాల్ వర్మ వంటి విలక్షణ దర్శకుడి ప్రశంసలు సైతం అందుకుంది. ఈ చిత్ర దర్శకుడు మారుతికి మరో పెద్ద సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం కూడా గమనార్హం. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జేబి సంగీతం అందించాడు.