సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘మనోహరుడు’ సినిమా షూటింగ్ ఈ మధ్య చాలా గోప్యంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమాతో శంకర్ ఎలాంటి ప్రయోగం చేస్తున్నాడని ఇంకా తెలియదు, కానీ ఈ సినిమాలో ఇప్పటి వరకు ఆయన టచ్ చేయని కథాంశంతో తీస్తున్నాడని తెలిసింది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరిగింది, ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను మైసూర్ లో షూట్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో విక్రం – అమీ జాక్సన్ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్రం 15 సంవత్సరాల అబ్బాయిలా అలాగే ఒక ముసలి వాడి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. విక్రం కి రెండు డిఫరెంట్ లూక్స్ లో కనిపించాలని శంకర్ చెప్పాడని దానికి తగ్గట్టుగా బాడీని మార్చుకోమని చెప్పినట్టు సమాచారం. మొదటి సారి శంకర్ సినిమాకి పిసి శ్రీ రామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.