విషాదం : ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూత

విషాదం : ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూత

Published on Jul 13, 2025 6:53 AM IST

తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో అగ్రస్థానం దక్కించుకున్న కోట శ్రీనివాసరావు గారు ఆదివారం ఉదయం 4 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వయస్సు 83 సంవత్సరాలు.

నాటక రంగం నుంచి వెండితెరకు వెళ్లిన కోట గారు, నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 750కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయక పాత్రలు నుంచి హాస్య పాత్రలు, లోతైన సామాజిక పాత్రల వరకు ఆయన చేసిన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 1978లో విడుదలైన ‘ప్రాణం ఖరీదు’తో ఆయన సినీరంగ ప్రవేశం చేశారు.

శివ, గాయం, శత్రువు, మనీ, అహ నా పెళ్లంట, బొమ్మరిల్లు, అతడు, లీడర్, రక్తచరిత్ర, ఎస్/ఓ సత్యమూర్తి, అత్తారింటికి దారేది వంటి అనేక చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసాయి. 2003లో తమిళ చిత్రమైన ‘సామీ’తో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన, అక్కడ కూడా విలక్షణమైన ప్రతినాయకుడిగా పేరు సంపాదించారు.

కృష్ణా జిల్లాలోని కంకిపాడు గ్రామంలో 1942, జూలై 10న జన్మించిన కోట గారు, చిన్ననాటినుంచి వైద్యవృత్తిపై ఆసక్తి కనబరిచారు. ఆయన తండ్రి సీతారామ అంజనేయులు ఒక వైద్యుడు. కానీ నటనపై ఉన్న మక్కువ ఆయనను రంగస్థలానికి దగ్గర చేసింది. బి.ఎస్‌సి పట్టా పొందిన తర్వాత స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూనే నాటకాల్లో నటిస్తుండేవారు.

తన నటనా నైపుణ్యానికి గాను తొమ్మిది నంది అవార్డులు అందుకున్నారు. 2015లో భారత ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారంను ప్రకటించింది. ఇది భారతీయ చిత్రసీమలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నిలిచింది.

ఆయన మృతి తెలుగు చిత్రసీమకు తీరని లోటు. కళానటుడిగా మాత్రమే కాక, విలక్షణమైన వ్యక్తిగా కూడా గుర్తుండిపోయే కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు