ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇండియన్ ఐడల్ 5 కి వెళ్లి విజేతగా నిలిచి తెలుగు వారిని గర్వించేలా చేసిన సింగర్ శ్రీ రామ చంద్ర. ఈ సింగర్ ఇప్పుడు మరో అవతారమెత్తి నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆర్.వి సుబ్బు దర్శకత్వం వహించనున్న ‘ప్రేమ గీమా జాంతా నై’ సినిమా ద్వారా హీరోగా పరిచయం కానున్నారు. దాది బాల భాస్కర్ మరియు ముద్దల భాస్కర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిన్న హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభమైంది. డా. డి రామానాయుడు ముఖ్య అతిధి గా విచ్చేసిన ఈ కార్యక్రమంలో డా. టి. సుబ్బరామి రెడ్డి క్లాప్ ఇవ్వగా, బి. గోపాల్ మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
శ్రీ రామ చంద్ర మాట్లాడుతూ ‘ నాకు మామూలుగా ప్రపంచ సంగీతం మరియు పాడటం మీద అవగాహన ఉంది, నటన మీద కూడా అంతే అవగాహన రావాలని యాక్టింగ్ క్లాసులకు వెళ్లి శిక్షణ తీసుకున్నాను. ఎంటర్టైనింగ్ గా సాగే లవ్ స్టొరీ ఇది. ఈ సినిమాకి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తానన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు. శ్రీ రామ చంద్ర నటన కూడా అతని సింగింగ్ లాగే ఉంటుందా? లేదా? అనే దాని కోసం కొంత కాలం వేచి చూడాలి.