ఆదిని ప్రమోట్ చెయ్యడం కోసమే వచ్చాను – అల్లు అర్జున్

Sukumarudu Triple Platinum Disc (50)

సాయి కుమార్ తనయుడు ఆది, నిషా అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా, సూపర్ స్టార్ కృష్ణ – ఊర్వశి శారద ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘సుకుమారుడు’. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ రోజు ఉదయం ప్రసాద్ లాబ్స్ లో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు. అలాగే హీరో ఆది, నిషా అగర్వాల్, డైరెక్టర్ అశోక్, అనూప్ రూబెన్స్, కెవివి సత్యనారాయణ, వేణు గోపాల్, సాయి కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సాయి కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ ‘ ఆడియో ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా ఆడియో కంటే పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాకు ఇష్టమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు.

కెవివి సత్యనారాయణ మాట్లాడుతూ ‘ ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కి స్పెషల్ అట్రాక్షన్ తెచ్చిన అల్లు అర్జున్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు. ఈ సినిమాలో ఆది అద్భుతమైన నటనని కనబరిచాడు. శారద గారితో సమానంగా ఆది నటించాడు. సుకుమారుడు అందరూ ఎంజాయ్ చేసే సినిమా అని’ అన్నాడు

సాయి కుమార్ మాట్లాడుతూ ‘ బిజీగా ఉండి కూడా పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చిన బన్నికి ప్రత్యేక కృతఙ్ఞతలు. మూడవ సినిమాతోనే సూపర్ స్టార్ కృష్ణ, ఊర్వశి శారద గారితో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆదికి దక్కిన అదృష్టం. నేను ఎన్నో సినిమాలు చేసిన తర్వాత గానీ ‘పోలీస్ స్టొరీ’ లాంటి సినిమా రాలేదు కానీ ఆదికి మూడవ సినిమాతోనే ఎక్కువ షేడ్స్ ఉన్న పాత్ర చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ లవ్లీ సుకుమారుడుకి మీ ప్రేమ కావాలని కోరుకుంటున్నానని’ అన్నాడు.

ఆది మాట్లాడుతూ ‘ అన్నయ్య బన్ని ఈ ఫంక్షన్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవలే ‘ఇద్దరమ్మాయిలతో’ లోని ఫస్ట్ సాంగ్ చూసాను. డాన్సులు సూపర్బ్ గా ఉన్నాయి, ఫ్యాన్స్ కి పండగే. ఇక నా సినిమా విషయానికొస్తే మ్యూజిక్ పెద్దహిట్ అయ్యింది. తప్పకుండా సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని’ అన్నాడు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ ఈ మూవీ టీం అందరూ నాకు తెలుసు. ముందుగా అనూప్ రూబెన్స్ వరుసగా సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకు పోతున్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలోని పెద్ద స్టార్స్ నీకు చాన్స్ ఇవాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే పెద్ద సినిమా ఆఫర్లు వచ్చి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఈ ఫంక్షన్ కి రావడానికి గల ఏకైక కారణం ఆది. బిజీగా ఉండి కూడా కేవలం ఆదిని ప్రమోట్ చెయ్యడానికే ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరిలోనూ ఆది అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా నాకు నచ్చితే వాళ్ళు కెరీర్లో సక్సెస్ అవుతారు. ఆదికి త్వరలోనే పెద్ద సినిమా అవకాశాలొచ్చి బిగ్ స్టార్ అవుతాడు. అతని సినిమా క్లిప్స్ వస్తున్నాయి అంటే ఆగి మరీ చూసి వెళ్తాను ఎందుకంటే ఆది సినిమా కోసం చాలా కష్టపడతాడు. ఆది బిహేవియర్ చాలా బాగుంటుంది. సాయి కుమార్ గారు సినిమాల పరంగా పక్కన పెడితే బిహేవియర్ విషయంలో ఆది నా కొడుకు అని మీరు గర్వంగా చెప్పుకోవచ్చని’ అన్నాడు.

Exit mobile version