ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) “తానా హెల్త్ అండ్ వెల్నెస్” శీర్షికన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సహకారంతో నిర్వహించిన ఆక్యుప్రెషర్ వర్క్ షాప్ జులై 21వ తేదీన మయూరి రెస్టారెంట్ లో తానా ప్రాంతీయ ప్రతినిధి డా.అడుసుమిల్లి రాజేష్ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. డాల్లస్ ప్ర్రాంత తెలుగు వారు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తి తో ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
డా. రాఘవేంద్ర ప్రసాద్ గారి ప్రార్థనాగీతంతో వర్క్ షాప్ ను ప్రారంభించారు. రాజేష్ అడుసుమిల్లి తమ స్వాగతోపన్యాసం లో తానా వారు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. భారతదేశం నుండి విచ్చేసిన ప్రపంచ ప్రఖ్యాత నాచురల్ థెరపిస్ట్ ప్రొఫెసర్ రవీంద్రన్ గారు కార్యక్రమం మొదటి భాగంలో ప్రకృతికి మానవ శరీరానికి గల అనుబంధాన్ని, అల్లోపతి మెడిసిన్ తో పాటు మనకి ప్రకృతి పరంగా లభించిన వ్యాధి నిరోధక శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి వంటి అంశాలను అందరికీ అర్ధం అయ్యేవిధంగా కూలంకుషంగా వివరించారు. చిన్న విరామం తరువాత జరిగిన రెండో భాగంలో సభలో వెన్ను నొప్పి, థైరాయిడ్, డయాబెటిస్, వంటి సమస్యలున్న వారిని పరీక్షించి అందరి ముందర వారికి ఆక్యుప్రెషర్ ద్వారా చికిత్స చేసి అందరి మన్ననలు పొందారు. అంతే కాకుండా, ఆయన ఉపయోగించిన ఆక్యు ప్రెషర్ మెలకువలను సభికులకి విపులంగా వివరించి వాటిని ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాభివృద్ధికి దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించవచ్చో నేర్పించారు. కిక్కిరిసిపోయిన ఈ వర్క్ షాప్ నాలుగు గంటలపాటు జరిగినా కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కదలకుండా కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొని ఇటు వంటి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని తానా సంస్థ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.
తానా పూర్వాధ్యక్షులు తోటకూర ప్రసాద్, తానా బోర్డ్ డైరెక్టర్ యలమంచిలి రామ్, తానా ఫౌండేషన్ ట్రెషరర్ కన్నెగంటి మంజులత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా సభ్యులు వెన్నం మురళి, పోలవరపు శ్రీకాంత్, వీరపనేని అనిల్, దొడ్డ సాంబ, కొండ్రకుంట చలపతి, నార్నెరాము, ఆరేపల్లి అనిల్ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు. టాంటెక్స్ నించి అధ్యక్షుడు మండువ సురేష్, ఉరిమిండి నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, పున్నం సతీష్, సింగిరెడ్డి శారద, చామకూర బాల్కి తదితరులు పాల్గొన్నారు.
అడుసుమిల్లి రాజేష్ వందన సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించిన కల్లూరి భావన, గంగ దేవదాస్ గార్లకు, తానా సభ్యులకు, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు, మయూరి రెస్టారెంట్ యాజమాన్యానికి, కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన తెలుగు వారందరికీ కృతజ్ఞతా పూర్వక అభినందనలు తెలియజేసారు.