స్వతహాగా తమిళ హీరో అయిన సూర్యకి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. తను నటిచ్న్హిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యాయి. అలాగే తన తమ్ముడు కార్తీ కూడా కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. నటన విషయంలో ఎవరికీ ఎవరూ తీసిపోరు అని అనిపించుకుంటున్న ఈ ఇద్దరు హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే సింగం మాతో సూపర్ హిట్ అందుకున్న హీరో సూర్య తన కంటే తమ్ముడే గ్రేట్ అంటున్నాడు.
ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ తమ్ముడికి మీరేమన్నా సలహాలు ఇస్తుంటారా అని అడిగితే ‘ నాకంటే కార్తీ చాలా స్పీడ్. ఏదన్నా అనుకున్నాడు అంటే అది నేర్చుకునేంతవరకూ వదలడు. వాడు ఏదైనా చాలా క్లారిటీతో చేస్తాడు. వాడిని కాంపిటీటివ్ గా ఫీలవుతాను. చెప్పాలంటే ‘యుద్దంలో సైన్యం మొత్తం అంతమైనా పర్లేదు, వెనుక తమ్ముడుంటే చాలు. ఆ తోడు లక్ష మంది బలాన్నిస్తుంది’. అలాగే నా తమ్ముడే నా ధైర్యం. సలహాలు ఇచ్చే రేంజ్ నాది కాదు, వాడిదే. ఏది ఏమైనా నా తమ్ముడు గ్రేటండీ’అని అన్నాడు.