సుమన్ చేతుల మీదుగా ‘RK దీక్ష’ ట్రైలర్ విడుదల

సుమన్ చేతుల మీదుగా ‘RK దీక్ష’ ట్రైలర్ విడుదల

Published on Dec 7, 2025 7:00 PM IST

Suman

ప్రముఖ నటుడు సుమన్ చేతుల మీదుగా ‘ఆర్ కె దీక్ష’ (RK Deeksha) చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్ కె ఫిలిమ్స్, స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని డి.ఎస్. రెడ్డి సమర్పిస్తున్నారు. కిరణ్ హీరోగా, ‘ఢీ జోడి’ ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ వేడుకకు నిర్మాత సి. కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ తదితరులు హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ విడుదల అనంతరం సుమన్ మాట్లాడుతూ.. రామకృష్ణ గౌడ్ మీదున్న అభిమానంతో షూటింగ్ నుండి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే జవాన్ల త్యాగాలను స్మరిస్తూ ఈ చిత్రంలో ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించడం అభినందనీయమని, సినీ పరిశ్రమ ఎప్పుడూ సైనికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఐదు పాటలు, మూడు ఫైట్స్‌తో ఈ చిత్రాన్ని ఏడాది కాలంలో పూర్తి చేశామని దర్శకుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలర్పించిన మురళి నాయక్‌కు అంకితమిచ్చిన పాట, హీరో చెప్పే సింగిల్ షాట్ సంస్కృత డైలాగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది.

తాజా వార్తలు