పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ పనులు ముగించుకుని జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సినిమాను క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండటం.. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సాలిడ్‌గా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ చిత్రం తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదని.. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కిందని మేకర్స్ చెబుతున్నారు.
జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘హరి హర వీరమల్లు’ కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ.. సరికొత్త కథగా దీనిని మలిచారు. పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం మరియు వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో.. అలాగే ‘హరి హర వీరమల్లు’ను శివుడు మరియు విష్ణువుల అవతారంగా చూడబోతున్నాం. సరిగ్గా గమనిస్తే, హరి(విష్ణు) హర(శివుడు) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు, విష్ణువు అవతారం ‘వీరమల్లు’ అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే, కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి మరియు ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇక ఈ సినిమాను ఎ.ఎం.రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.