టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు, దర్శక ధీరుడు అంటే చెప్పే ఒకే ఒక్క పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తన టాలెంట్ తో, సక్సెస్ లతో శ్రీశైలం శ్రీ రాజమౌళి అనే పేరుని సూపర్ సక్సెస్ఫుల్ రాజమౌళి అని పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు సినిమా స్థాయిని, క్రియేటివిటీని మరియు కమర్షియల్ సినిమా రేంజ్ ని పెంచిన దర్శకుడు రాజమౌళి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. విజయేంద్ర ప్రసాద్ గారి దంపతులకి కర్ణాటకలోని రాయ్ చూర్లో 1973 అక్టోబర్ 10న రాజమౌళి జన్మించారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రాజమౌళి ఆ తర్వాత రాఘవేంద్ర రావు గారి ప్రొడక్షన్ లో ఒక టీవీ సీరియల్ కి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేసిన ‘స్టూడెంట్ నెం 1’ సినిమాతో మొదలు పెట్టిన ఆయన విజయ పరంపరని ఆయన చివరిగా తీసిన ‘ఈగ’ వరకూ కంటిన్యూ చేసారు. రాజమౌళి ఒక్క ఎన్.టి.ఆర్ తోనే మూడు సినిమాలు చేసారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘స్టూడెంట్ నెం 1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాగే యంగ్ హీరోస్ అయిన నితిన్, ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్ మరియు నానిలతో సినిమాలు చేసి వరుస విజయాలు అందుకున్నాడు.
రాజమౌళి 2009లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన ‘మగధీర’ సినిమా బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి, కొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా ‘మగధీర’ నే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.
ఆయన చివరిగా తీసిన గ్రాఫికల్ మానియా ‘ఈగ’ సినిమా భాషా బేధం లేకుండా దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించడమే కాకుండా, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. అంతే కాకుండా దర్శక ధీరుడికి మరియు తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఎన్నడూ నిర్మించనంత అత్యంత భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు పార్ట్స్ గా ప్రేక్షకులకు అందించనున్న ఈ సినిమాలో కళ్ళు చెదిరే సెట్స్, అబ్బురపరిచే విజువల్స్, భారీ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయి.
తెలుగు సినిమా రేంజ్ ని పెంచిన సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి తన విజయ పరంపరని ఇలానే కొనసాగించి, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ 123తెలుగు.కామ్ తరపున ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..