తమిళ, మలయాళ భాషల్లో విజయవంతమైన “బల్టీ” ఈ నెల 10న తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉన్ని శివలింగం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కబడ్డీ నేపథ్యంలో రాజకీయాలు, గ్యాంగ్‌స్టర్ అంశాలను మేళవించిన రా, రస్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా రూపుదిద్దుకుంది. తెలుగులో విడుదల బాధ్యతలు ఎల్మా పిక్చర్స్ తీసుకుంది.
ఎల్మా పిక్చర్స్ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ, “తమిళం, మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. అందుకే తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ అందించిన సంగీతం హైలైట్. షేన్ నిగమ్ నటన అద్భుతం; ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్ నిలిచే పాత్రలు చేశారు; సెల్వరాఘవన్ విలన్‌గా ఆకట్టుకున్నారు” అన్నారు.
దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ, “తమిళనాడు–కేరళ సరిహద్దులోని వెలంపాళయం నేపథ్యంలో సాగే ఈ కథలో, గ్రామాన్ని నియంత్రించే ముగ్గురు పెద్దల వ్యాపార–రాజకీయాల్లో నలుగురు కబడ్డీ క్రీడాకారులు చిక్కుకుంటారు. అక్కడి నుంచి ఉత్కంఠ, ఘర్షణలు, భావోద్వేగాలతో ముందుకు సాగే కథే ‘బల్టీ’” అని చెప్పారు.


