చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ‘ఈగ’ హిందీ వర్షన్ అనుకున్న టైం కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.ఎస్ రాజమౌళి మరియు అతని టీం మెంబర్స్ ఈ చిత్రాన్ని 3డి లోకి మార్చి ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం చివర్లో విడుదల చేయాలనుకున్నారు కానీ అనుకున్న టైం కంటే ముందే రానుంది. ఇటీవలే ఓ ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ‘ ‘ఈగ’ చిత్రానికి హిందీలో ‘మక్కి’ అనే టైటిల్ ని ఖరారు చేశాం. హిందీలో మరో నెలలో విడుదలచేయనున్నామని’ ఆయన అన్నారు. ప్రస్తుతం హిందీ నేటివిటీకి సంభందించిన చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి కానీ నటీనటులలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ ‘ఈగ’ చిత్రాన్ని ఇప్పుడు రిలీజ్ చేయడమే సరైన సమయం అని, అదే సంవత్సరం చివర్లో అయితే బాలీవుడ్ పెద్ద చిత్రాలు విడుదల కారణంగా థియేటర్లు దొరక్కపోయే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. తెలుగులో లానే హిందీ వర్షన్ లో కూడా సల్మాన్ ఖాన్ ఫేమస్ పాటలకి ఈగ డాన్సు చేయనుందని రాజమౌళి అన్నారు. నాని, సుదీప్ మరియు సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు.