కేబినెట్ తెలంగాణ నోట్ క్లియర్ చెయ్యగానే సీమాంధ్రలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతాన్ని 72 గంటలు దిగ్బందం చేసారు. సమైక్య వాదులు ఇదే ఆందోళనల్ని మరి కొద్ది రోజులు కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నారు. దీనివల్ల ట్రేడ్ వర్గాల వారు దసరాకి రిలీజ్ అవుతాయనుకున్న కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడతాయని అనుకుంటున్నారు.
ఇదిలా ఉన్నా నిర్మాత దిల్ రాజు మాత్రం ఎన్.టి.ఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాని మాత్రం వాయిదా వేసే ఆలోచనలో లేరు. ఈ రోజు సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మరోసారి దిల్ రాజు రిలీజ్ డేట్ ని ఖరారు చేసారు. ‘మేము ముందుగా చెప్పినట్లే రామయ్యా వస్తావయ్యా సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఆలస్యం అయితే ఒకటి లేదా రెండు రోజులు అవ్వచ్చు తప్ప అంతకన్నా అలస్యమవ్వదని’దిల్ రాజు తెలిపారు.
ఎన్.టి.ఆర్ – సమంత జంటగా కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.