సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా

సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా

Published on Oct 24, 2025 2:02 PM IST

Bison

విడుదల తేదీ : అక్టోబర్ 24, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి, అమీర్ తదితరులు
దర్శకుడు : మారి సెల్వరాజ్
నిర్మాతలు : సమీర్ నాయర్, దీపక్ సీగల్, పా రంజిత్, అదితి ఆనంద్
సంగీత దర్శకుడు : నివాస్ కె. ప్రసన్న
సినిమాటోగ్రాఫర్ : ఎజిల్ అరసు కె
ఎడిటర్ : శక్తి తిరు

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బైసన్’ తమిళంలో దీపావళి కానుకగా రిలీజ్ అయింది. అయితే, తెలుగులో నేడు(అక్టోబర్ 24) ఈ సినిమా రిలీజ్ అయింది. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

1990ల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కిట్టయ్య(ధృవ్ విక్రమ్) కబడ్డీ ఆటలో రాణించాలని అనుకుంటాడు. అయితే తన కొడుకు భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశ్యంతో అతడి తండ్రి వేలుసామి(పశుపతి) కిట్టయ్యను కబడ్డీ ఆట ఆడొద్దని ఆదేశిస్తాడు. వారి గ్రామంలో కులవివక్ష ఎక్కువగా ఉండటంతో కిట్టయ్య కుటుంబాన్ని ఇతర కులస్థులు అనగదొక్కుతారు. ఇలాంటి క్లిష్ట పరిస్థతుల్లో కూడా కిట్టయ్య కబడ్డీ ఆడుతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సమస్యలు ఏమిటి..? అతడు కబడ్డీలో రాణిస్తాడా..? తన గ్రామంలో ఉన్న కులవివక్షను హీరో చెరిపేస్తాడా..? అనేది ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు మారి సెల్వరాజ్ సమాజంలో జరుగుతున్న అణచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలను మరోసారి టచ్ చేశాడు. అయితే, ఈసారి కబడ్డీ ఆట నేపథ్యంలో ఈ అంశాలను ప్రజెంట్ చేశాడు. ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈ అనచివేతకు గురయ్యే వారి కథను చక్కగా ప్రజెంట్ చేశాడు.

ధృవ్ విక్రమ్ ఈ సినిమాలో తన పాత్ర కోసం తీవ్రంగా శ్రమించాడు. అతడు పడ్డ కష్టం మనకు వెండితెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ నుంచి ఎమోషనల్ సీన్స్ వరకు అతడి కష్టం మనకు కనిపిస్తుంది.

ప్రేమ, భయం మధ్య నలిగే తండ్రి పాత్రలో పశుపతి కూడా బాగా రాణించారు. ధృవ్-పశుపతి మధ్య వచ్చే సీన్స్‌లో ఆయన నటన చక్కగా ఉంటుంది. సినిమాకు కావాల్సిన ఎమోషన్‌ను పండించడంలో పశుపతి సక్సెస్ అయ్యాడు.

మిగతావారిలో లాల్, అమీర్, రజీషా విజయన్ తమ పాత్రలతో ఆకట్టుకుంటారు. అనుపమ పరమేశ్వరన్ పాత్రకు పెద్ద స్కో్ప్ లేకపోయినా ఉన్నంతలో బాగుంది.

మైనస్ పాయింట్స్ :

అర్జున అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్ మణాతి గణేశన్ నిజజీవిత కథ ఆధారంగా ‘బైసన్’ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవాన్ని, ఎమోషన్‌ను సమపాలలో చూపించే క్రమంలో సినిమా చాలా సాగదీతగా అనిపిస్తుంది.

మారి సెల్వరాజ్ గత చిత్రాలలో కనిపించిన ఎమోషనల్ ఇంపాక్ట్ బైసన్ చిత్రంలో మిస్ అయ్యింది. ఈ సినిమా నిడివి, రిపీటెడ్‌గా వచ్చే సీక్వెన్స్‌లు, ఊహించగలిగే కథనం సినిమాకు మైనస్‌గా నిలిచాయి.

ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామా యాంగిల్‌లో ప్రజెంట్ చేయాలని ప్రయత్నించినా అది వర్కవుట్ కాలేదు. కబడ్డీ ఆటతో డ్రామా క్రియేట్ చేయాలని చూసినా, సినిమాలోని సామాజిక అంశాలే ఎక్కువగా ప్రభావితం చేశాయి.

ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో వినియోగించిన యాస ప్రేక్షకులను పెద్దగా మెప్పించదు. తమిళ సైన్ బోర్డులు, వార్తా పత్రికలు, టాటూలు వంటివి ట్రాన్స్‌లేట్ చేయకపోవడం మరో మైనస్. ఇక ఇందులోని వయొలెన్స్ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించదు.

సాంకేతిక విభాగం :

రైటర్, డైరెక్టర్‌గా మారి సెల్వరాజ్ ఒక డీసెంట్ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆయన గత చిత్రాలతో ఈ సినిమా ఎక్కడా పోటీ పడదు. బైసన్ చిత్రంలోని స్లో పేస్, రిపీటెడ్ సీన్స్ మెప్పించవు. ఎజిల్ అరసు కె సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. రూరల్ బ్యాక్‌డ్రాప్, కబడ్డీ సన్నీవేశాలను బాగా చూపెట్టారు.

నివాస్ కె ప్రసన్న సంగీతం డీసెంట్‌గానే ఉన్నా, కొన్ని చోట్ల సౌండ్ ఎక్కువగా అనిపిస్తుంది. శక్తి తిరు ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే, ‘బైసన్’ చిత్రం అనచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలను టచ్ చేసే స్పోర్ట్స్ డ్రామాగా పర్వాలేదనిపిస్తుంది. ధృవ్ విక్రమ్ డెడికేషన్, పశుపతి ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌లు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే, మారి సెల్వరాజ్ గతచిత్రాలతో పోలిస్తే ఈ సినిమా పెద్ద ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది. సాగదీసే రన్‌టైమ్, వీక్ రైటింగ్ వంటి అంశాలు ఈ చిత్రానికి డ్యామేజ్ చేశాయి. స్పోర్ట్స్ డ్రామాలతో పాటు సామాజిక అంశాలు ఉన్న చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు