సుకుమార్, క్రిష్ ప్రశంసలు పొందుతున్న ‘మనసా నమః’ !

సుకుమార్, క్రిష్ ప్రశంసలు పొందుతున్న ‘మనసా నమః’ !

Published on Apr 28, 2020 11:21 PM IST

ఇండస్ట్రీలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఓ కుర్రాడు తీసిన ఒక షార్ట్ ఫిలిం గత కొంత కాలంగా తెగ సందడి చేస్తోంది. ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందుతోంది. వేరే భాషల్లోనూ దీనిని డబ్బింగ్ చేసేందుకు జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. చిన్న సైజు సంచలనం సృష్టిస్తున్న ఆ షార్ట్ ఫిలిం ‘మనసా నమః’. దాని సృజనకర్త పేరు ‘దీపక్ రెడ్డి’. ప్రముఖ దర్శకులు సుకుమార్, క్రిష్, సందీప్ వంగా, సుజీత్, గౌతమ్ మీనన్- ప్రముఖ హీరోలు సందీప్ కిషన్, అడవి శేష్, రక్షిత్ శెట్టి (కన్నడ హీరో), సంగీత సంచలనం తమన్ లతోపాటు అనుష్క, రష్మిక వంటి టాప్ హీరోయిన్లు కూడా ‘మనసా నమః’ను మనసారా మెచ్చుకోవడంతో దీపక్ రెడ్డి వైపు అందరూ దృష్టి సారిస్తున్నారు.
.

చిన్నప్పటి నుంచి సినిమాలంటే పడి చచ్చేంత ప్రేమను పెంచుకున్న దీపక్.. అమ్మ మనసు నొప్పించలేక.. కర్నూలులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసి.. అన్నయ్య మాట కాదనలేక… అమెరికాలోని టెక్సాస్ లో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేశాడు. అమెరికాలో ఉండగా శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాకి వర్క్ చేసి, అక్కడ ఏర్పడిన పరిచయాలతో.. హైదరాబాద్ తిరిగి వచ్చాక ‘వీకెండ్ సినిమా’ పేరుతో ‘ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్’ స్టార్ట్ చేసిన దీపక్.. ఇక అప్పటి నుంచి సినిమా రంగంతోనే మమేకమై ఉన్నాడు. పదిహేను సినిమాలకు పైగా విదేశాల్లో పంపిణీ చేసి.. అందులో ఉన్న ఎత్తు పల్లాలు తెలుసుకున్నాడు.

అమెరికా వెళ్ళడానికి ముందే.. ‘డబ్ల్యూ టి ఎఫ్’, ఎక్స్క్యూజ్ మి, హైడ్ అండ్ సీక్’ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో తన ఉనికిని ప్రకటించుకున్న ఈ యువ సృజనశీలి… తాజాగా రూపొందించిన ‘మనసా నమః’తో తన ప్రతిభను ఘనంగా ప్రకటించుకుని.. పరిశ్రమవర్గాల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. విరాజ్ అశ్విన్, దృషిక, శ్రీవల్లి నటించిన ‘మనసా నమః’ లఘు చిత్రాన్ని శిల్ప గజ్జల నిర్మించారు.

తన షార్ట్ ఫిలింకి వస్తున్న స్పదన గురించి దీపక్ మాట్లాడుతూ.. ‘నేను ఎంతగానో అభిమానించే సుకుమార్, క్రిష్, గౌతమ్ మీనన్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్సకుల మెప్పు పొందడం.. చాలా గర్వంగా ఉంది. వీళ్ళందరి పెద్ద మనసుకు పాదాభివందనం. ఈ ప్రశంసల పరంపరకు ముందుగా శ్రీకారం చుట్టిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మిత్రులు హరి-కర్మన్-రాజ్ అందించిన సాంకేతిక-సౌహార్ధ్ర సహాయ సహకారాల వల్లే.. ‘మనసా నమః’ ఈరోజు ఇంతగా మెస్మరైజ్ చేస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు త్వరలోనే స్టోరీ నేరేట్ చేసే అవకాశం వచ్చింది. నేను తెరక్కించే సినిమా.. మేకింగ్ పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ.. ‘మనసా నమః’కు మరిన్ని రెట్లు ఉంటుందని మాటిస్తున్నాను’ అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు