ఓటీటీ సమీక్ష : ‘క్రిమినల్ జస్టిస్’ సీజన్ 4 – జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ (3 ఎపిసోడ్స్ మాత్రమే)

ఓటీటీ సమీక్ష : ‘క్రిమినల్ జస్టిస్’ సీజన్ 4 – జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ (3 ఎపిసోడ్స్ మాత్రమే)

Published on May 29, 2025 9:17 PM IST

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 29, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : పంకజ్ త్రిపాఠి, మహ్మద్ జీషన్, సుర్వీన్ చావ్లా, ఆషా నేగి, మీతా వశిష్ట్, శ్వేతా బసు ప్రసాద్, ఖుషీ భరద్వాజ్ తదితరులు
దర్శకుడు : రోహన్ సిప్పి
నిర్మాతలు : సమీర్ నాయర్, దీపక్ సేగల్, సమీర్ గోగటే
సంగీతం : సమీర్ ఫతేర్పికర్
సినిమాటోగ్రఫీ : ముర్జీ పగ్డీవాలా
ఎడిటింగ్ : గౌరవ్ అగర్వాల్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో గతంలో వచ్చిన ‘క్రిమినల్ జస్టిస్’ వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. మూడు భాగాలుగా ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ‘క్రిమినల్ జస్టిస్ సీజన్ 4’ నేటి (మే 29) నుండి స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, ఈ సీజన్ 4కు సంబంధించి మేకర్స్ కేవలం 3 ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

డాక్టర్ రాజ్ (మహ్మద్ జీషన్) తన భార్య అంజూ(సుర్వీన్ చావ్లా)తో వేరుపడి జీవిస్తుంటాడు. అతని వద్ద తన కూతురు ఇరా(ఖుషీ భరద్వాజ్) కూడా ఉంటుంది. అయితే, నర్స్‌గా పనిచేసిన రోషిణి(ఆషా నేగి)తో ఎఫైర్‌లో ఉంటాడు డాక్టర్ రాజ్. వీరి ఎఫైర్ గురించి అందరికీ తెలిసిందే. కట్ చేస్తే.. ఇరా పుట్టినరోజు వేడుకులు జరిగిన మరుసటి రోజు రోషిణి గొంతు కట్ చేసి రాజ్ చేతుల్లో మరణించి కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాజ్‌ను అరెస్ట్ చేస్తారు. దీంతో తన భర్తను కాపాడాలని అంజూ లాయర్ మాధవ్ మిశ్రా(పంకజ్ త్రిపాఠి) వద్దకు వెళ్తుంది. ఇక ఆయన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు..? పోలీసులకు ఈ కేసులో ఎలాంటి విషయాలు తెలుస్తాయి..? అనేది ఈ వెబ్ సిరీస్‌లో చూపెట్టారు.

ప్లస్ పాయింట్స్ :

గతంలో వచ్చిన ‘క్రిమినల్ జస్టిస్’ వెబ్ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ సీజన్‌పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ వెబ్ సిరీస్‌లోనూ మర్డర్ జరగడం.. దానికి సంబంధించిన సస్పెన్స్‌లు కొనసాగడం.. వాటిని చేధించే లాయర్‌గా పంకజ్ త్రిపాఠి ఆకట్టుకున్నారు. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లలో ఉండే అంశాలు అన్నీ మనకు ఈ సీజన్‌లోనూ కనిపిస్తాయి.

కేసును చేధించే లాయర్‌గా పంకజ్ త్రిపాఠి మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా తనదైన హావభావాలతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడంతో పాటు వారిని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

మర్డర్ కేసును చేధించే క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి రావడం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, కేవలం మూడు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ కావడంతో, తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మిగిలిపోతుంది.

మైనస్ పాయింట్స్ :

క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 నుండి కేవలం మూడు ఎపిసోడ్స్ మాత్రమే రావడంతో ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆసక్తికర వెబ్ సిరీస్‌ను ఇలా ముక్కలుగా ఎందుకు స్ట్రీమింగ్ చేస్తున్నారని వారు నెట్టింట ఫైర్ అవుతున్నారు.

ఇక ఈ సీజన్ 4 తొలి ఎపిసోడ్‌లో ప్రేక్షకులను కథకు అలవాటు చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. అటు కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉండటం కొంతమేర మైనస్.

పంకజ్ త్రిపాఠి లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మరో ట్యాలెంటెడ్ నటి శ్వేతా బసు ప్రసాద్ పాత్ర కూడా ఇంకా పూర్తిగా చూపించలేదు అనే భావన కలుగుతుంది. రాబోయే ఎపిసోడ్స్‌లో ఈ లోటు తీరుతుందేమో అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రోహన్ సిప్పి ‘క్రిమినల్ జస్టిస్ సీజన్ 4’ కోసం ఎంచుకున్న కథ బాగుంది. ఆయన దానిని ప్రెజెంట్ చేస్తున్న తీరు కూడా ఆకట్టుకుంటుంది. అయితే, మూడు ఎపిసోడ్స్ మాత్రమే ఉండటంతో కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సంగీతం పరంగా బీజీఎం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే, క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా క్రిమినల్ జస్టిస్ – సీజన్ 4 కూడా మంచి నెరేషన్‌తో పాటు సాలిడ్ పర్ఫార్మెన్సులను కలిగి ఉన్నట్లు ఈ మూడు ఎపిసోడ్స్ చూస్తే అర్థమవుతుంది. ఉన్న మూడు ఎపిసోడ్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. కొంతమేర మెప్పించలేని స్క్రీన్ ప్లే మినహా మిగతా అంశాల్లో ఈ మూడు ఎపిసోడ్స్ పర్వాలేదనిపించాయి. మరి రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తిని ఈ మూడు ఎపిసోడ్స్ క్రియేట్ చేయగలిగాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు