మంచు ఫ్యామిలీ హీరోలంతా కలిసి చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’. జనవరి 31 అనగా రేపు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర టీం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు.
ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ ‘ పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నాన్నే అసలైన హీరో. మేమంతా ప్రత్యేక ఆకర్షణ మాత్రమే. సినిమా చూసి వచ్చే వారికి మనోజ్ లేడీ పాత్ర బాగా గుర్తుంటుంది. అంతలా ఆ పాత్ర డామినేట్ చేస్తుంది. అసలు ఆ పాత్రని నన్ను చేయమంటే నేను చేయలేను. అలాగే సినిమాకి పని చేసిన అందరూ అద్భుతమైన పనితీరును కనబరిచారని’ అన్నాడు.
అలాగే డా. మోహన్ బాబు పద్మశ్రీ విషయంపై స్పందిస్తూ ‘ నాన్న గారి పద్మశ్రీ విషయంపై వస్తున్న వార్తలకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకూ చాలా మంది తమకు వచ్చిన పద్మ పురష్కారాలను పలు విధాలుగా వాడుకున్నారు. కోర్టు తీర్పు తర్వాత మేము తెలుసుకున్న విషయం ఏమిటంటే పేరు ముందు గానీ, వెనుక గానీ పద్మశ్రీ వాడకూడదు కానీ పేరు తర్వాత ‘రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురష్కారం పొందిన’ అని వేసుకోవచ్చు. ఈ సినిమాలో కూడా ఇలా పద్మశ్రీ వేస్తామని’ విష్ణు అన్నాడు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీ వాస్, కోన వెంకట్, గోపి మోహన్, రత్నబాబు, బివిఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. డా. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, హన్సిక, ప్రణిత, రవీనా టాండన్, తనీష్, వరుణ్ సందేశ్ లు ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.