బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తున్న సోలో బాయ్ చిత్రం జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించారు.
ఇటీవల భారత రక్షణ రంగంలో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మురళి నాయక్ తల్లిదండ్రులు గౌతమ్ కృష్ణను తమ కుటుంబంలో మరో కొడుకుగా భావిస్తున్నట్లు తెలిపారు.
గౌతమ్ కృష్ణ ప్రకటన
ఈ కార్యక్రమంలో గౌతమ్ కృష్ణ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. తన సంపాదనలో సగం మొత్తాన్ని సామాజిక సేవకు కేటాయించేందుకు సమవర్తి ట్రస్టు ద్వారా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులో నుండి మొదటగా లక్ష రూపాయలు మురళి నాయక్ కుటుంబానికి అందజేస్తున్నట్లు ప్రకటించారు.
సోలో బాయ్ చిత్రం మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంతో రూపొందింది. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ వంటి అనుభవజ్ఞులు కీలక పాత్రలు పోషించారు. త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్‌గా, జుడా సంధ్య సంగీత దర్శకురాలిగా పని చేశారు. నిర్మాత సతీష్ ప్రకారం, గౌతమ్ కృష్ణ ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ తీసుకోకుండా, సినిమా నిర్మాణంలో తన వంతు పెట్టుబడిని కూడా పెట్టారు.