దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మగధీర’. రామ్ చరణ్ కెరీర్ లో భారీ విజయాన్ని అందుకుంది. అందులోని ఓ సన్నివేశం భావోద్వేగభరితంగా రావడానికి చిరంజీవి నటించిన ‘కొదమ సింహం’ చిత్రమే కారణమని రాజమౌళి తెలిపాడు. దాని గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ‘నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. అప్పట్లో థియేటర్‌లో ‘కొదమసింహం’ సినిమా చూస్తున్నా. అందులో, రౌడీలు చిరును పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు. అక్కడే ఉన్న ఆయన గుర్రం ఆయన నోటికి తాడు అందించి కాపాడుతుంది. ఆ సీన్ చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యా’ అని రాజమౌళి తెలిపాడు.
ఈ అంశం పై రాజమౌళి ఇంకా మాట్లాడుతూ.. ‘ఐతే, ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చిన ఆయనకు, గుర్రానికీ అనుబంధం లేదనిపించింది. చాలా నిరుత్సాహ పడిపోయా. నా దృష్టిలో అక్కడ అది గుర్రం కాదు. ప్రాణాలు కాపాడిన ఒక వ్యక్తి. మనకు సాయం చేసిన ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పకపోతే ఆ భావోద్వేగం ఎలా సంపూర్ణమవుతుంది? అనిపించింది. అది నా మైండ్‌లో అలాగే ఉండిపోయింది. అందుకే ‘మగధీర’లో చరణ్ తన గుర్రాన్ని కౌగలించుకునే విధంగా పెట్టాను’ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.