విక్రమార్కుడు-భేతాళ కథలు మన చిన్నప్పుడు విన్నవే. ఈ కథలు దాదాపు చందమామ పుస్తకాల్లో చదువుకున్నాము. ఫిలిం వర్గాల తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ విక్రమార్కుడు-భేతాళ కథల ఆధారంగా తెరకెక్కించే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తారని సమాచారం. 1960 లో లెజెండ్ ఎన్టీఆర్ నటించిన ‘భట్టివిక్రమార్క’ చిత్రానికి రిమేక్ చేయబోతున్నారని సమాచారం.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ విక్రమార్కుడిగా, కాంతారావు భట్టిగా, ఎస్వీ రంగారావు మాంత్రికుడుగా మరియు అంజలి దేవి ప్రభావతి దేవిగా నటించారు. ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే గాక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ రీమేక్ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మించనున్నట్లు సమాచారం. సాయిబాబు ఇటీవలే బాలకృష్ణతో ‘శ్రీ రామరాజ్యం’ చిత్రం తీసి విజయం సాధించారు. ఈ చిత్ర పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.