నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇషా చావ్లా మరియు పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటించిన ‘శ్రీమన్నారాయణ’ చిత్రం గత వారం విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్లో ఈ చిత్ర విజయోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ ‘ తెలుగు సినిమా ప్రేక్షకులు కొత్తరకమైన పాత్రలు ఆదరించినంత కాలం నేను కొత్తరకమైన సినిమాలు చేస్తాను. రవి కుమార్ చావాలి చెప్పిన కథ కథనం నాకు బాగా నచ్చి ఓకే చెప్పాను, నా నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా చెప్పిన దాని కంటే చాలా బాగా తీసాడు మరియు తెలుగుతనానికి విలువ ఇచ్చే దర్శకులలో రవికుమార్ కూడా ఒకరు. సినిమా విడుదలకి ముందు ఈ చిత్రంలో నేను వేసిన మూడు వేరే గెటప్పుల గురించి చెప్పలేదు అ అ గెటప్స్ ఒక్కసారి తెరపై చూసిన వారి ఆశ్చర్యానికి గురవుతున్నారు మరియు అలాగే గెటప్పులకి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి విషయాలన్నీ ముందే చెప్పేస్తే ప్రేక్షకులు సినిమా చూసేటప్పుడు థ్రిల్ కి గురవ్వరు అందుకనే అలాంటి విషయాలను దాయాలని’ ఆయన అన్నారు. అంతే కాకుండా బాలయ్య ‘చలాకీ చూపులతోనే’ అనే పాటను ఈ కార్యక్రమంలో పాడి అక్కడికి వచ్చిన శ్రోతలను అలరించారు.
ఈ కార్యక్రమానికి దర్శకుడు రవి కుమార్ చావాలి, నిర్మాత రమేష్ పుప్పాల, రాజా రవీంద్ర, కోట శ్రీనివాస రావు, కృష్ణ భగవాన్, సురేష్ తదితరులు హాజరయ్యారు.