రాజమౌళి ‘బాహుబలి: ది ఎపిక్’ అనే కొత్త వెర్షన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలు కలిపి, రీ-కట్ చేసి, రీ-మాస్టర్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముందస్తు బుకింగ్లు భారీ సంఖ్యలో ప్రారంభమయ్యాయి. కేవలం 24 గంటల్లోనే, హైదరాబాద్, బెంగళూరు మరియు ఇతర ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్ల ద్వారా దాదాపు 61 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. పూర్తి బుకింగ్లు ప్రారంభమైన తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
కాగా ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి మరియు తమన్నా భాటియా నటించిన బాహుబలి భారతీయ సినిమాలో అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ ఎపిక్ వెర్షన్ మరి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రేక్షకులు అయితే ఈ సినిమా రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
