జయభేరి ఆర్ట్స్‌లో వచ్చిన ‘అతడు’ చిత్రం వేరే లెవెల్ – మురళీ మోహన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీ-రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌ను మేకర్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘మా బ్యానర్‌లో 2005 ఆగస్ట్ 10న అతడు సినిమాను రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ-రిలీజ్ చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా అప్‌గ్రేడ్ చేసి ఈ మూవీని మళ్లీ విడుదల చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు ప్రసాద్ అండ్ టీం సహకరించింది. రైటర్‌గా త్రివిక్రమ్ గారు మంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు మా బ్యానర్‌లో దర్శకుడిగా పరిచయం చేసి, ఆయనతో మొదటి సినిమా చేయాలని అనుకున్నాం. ఆ టైంలో కథ చెప్పమని ఆయన్ను పిలిపించాం. స్రవంతి కిషోర్ గారికి మాటిచ్చాను.. వారి బ్యానర్‌లో సినిమా చేసిన తరువాత మీ వద్దకు వస్తానని త్రివిక్రమ్ అన్నారు. ఆ తరువాత మా వద్దకు వచ్చి మూడు గంటల పాటుగా ఈ ‘అతడు’ కథను కళ్లకు కట్టినట్టుగా చెప్పారు.

మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ మాట్లాడుతూ.. ‘‘అతడు’ సినిమాను మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఈ రీ రిలీజ్‌ల ద్వారా ఎంత డబ్బు వచ్చినా సరే దాన్ని ఫౌండేషన్‌ కోసమే వాడుతున్నాం. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామ’ని అన్నారు.

జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల మాట్లాడుతూ.. ‘‘అతడు’ మూవీని ఫిల్మ్‌లో తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని దాన్ని 8k, సూపర్ 4Kలోకి మార్చాం. డాల్బీ సౌండ్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ ఫైట్‌లో సౌండింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. మళ్లీ ఈ మూవీని థియేటర్లో చూస్తే పాత రోజులు గుర్తుకు వస్తాయి’ అని అన్నారు.

ఎక్సెల్ బ్యానర్ ప్రతినిధి జితేంద్ర గుండపనేని మాట్లాడుతూ.. ‘సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న ‘అతడు’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నాం. నాకు ‘అతడు’ చిత్రం చాలా ఇష్టం. రీ రిలీజ్ అని తెలిసిన వెంటనే నేను వెళ్లి సంప్రదించాను. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాల కంటే ఎక్కువగా కలెక్షన్లను సాధిస్తుందని నమ్ముతున్నాను. మరోసారి ‘అతడు’ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నామ’ని అన్నారు.

Exit mobile version