ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతాలలో జూబ్లీ హిల్స్ కూడా ఒకటి. ఈ ప్రాంతంలో అనేక వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఉంది. ఒకప్పుడు విస్తారమైన నిర్జన భూమిగా ఉన్న ఈ ప్రాంతంలో రాళ్లురప్పలు మాత్రమే ఉండేవి.
1975 ఆగస్టు 13న ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన దూరదృష్టితో ఈ నిర్జన ప్రదేశంలో శిలాఫలకం ప్రతిష్టించారు. తెలుగు సినిమాకు తన స్వంత నేలలోనే ఒక కేంద్రం ఉండాలన్న గట్టి విశ్వాసంతో, ANR గారు హైదరాబాద్లో తెలుగు సినిమాకు స్వగృహాన్ని నిర్మించే మొదటి అడుగు వేశారు. ఆ అడుగే జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, కృష్ణా నగర్ల రూపకల్పనకు దారితీసి, హైదరాబాద్ సినిమా రంగ భవిష్యత్తును మలిచింది.
1976 జనవరి 14న, అప్పటి భారత రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ గారి చేత స్టూడియో అధికారికంగా ప్రారంభించబడింది. ఆ తరువాత స్టూడియో స్థిరంగా అభివృద్ధి చెందుతూ, నేడు పలు షూటింగ్ ఫ్లోర్స్, ఔట్డోర్ సెట్స్, ప్రపంచ స్థాయి పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలను కలిగి ఉంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి, స్టూడియో ‘అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’ను స్థాపించింది. ఇందులో నటన నుంచి దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ వరకు అన్నీ నేర్పిస్తారు.
కాగా నేటికి అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ, ఇది పూర్తి సామర్థ్యంతో కొనసాగుతోంది. ఒకప్పుడు నిర్జన భూమి మాత్రమే అయిన ఈ ప్రదేశం, నేడు భారతీయ సినీ రంగంలో అత్యంత గౌరవనీయమైన సృజనాత్మక కేంద్రాలలో ఒకటిగా నిలిచింది.