ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో సూపర్బ్ సెట్స్ వేసి అందరినీ ఆకట్టుకుంటున్న ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. ‘తొలిప్రేమ’, ‘బొమ్మరిల్లు’, ‘బృందావనం’, ‘బద్రినాథ్’, ‘సైనికుడు’, ‘ఖలేజా’, ‘శక్తి’ మొదలైన ఎన్నో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ సాయి తన కెరీర్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం పవన్ కళ్యానే కారణం అని చెబుతున్నాడు.
అసలు విషయం ఏమిటనేది ఆయన మాటల్లోనే ‘ నాకు సినిమా రంగంలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ అంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందు నాకు మంచి ఫ్రెండ్. ఆయనే హీరో అయ్యాక మొదట నన్ను గోకులంలో సీత సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పరిచయం చేసాడు. ఆతర్వాత సినిమా ఫీల్డ్ నాకు సెట్ కాదని చెన్నై వెళ్ళిపోయాను. తొలిప్రేమ టైంలో నన్ను పిలిచి ఆ సినిమాకి సెట్స్ వేయమన్నారు. నేను కొంతకాలం టైం తీసుకొని ఓకే చెప్పాను. తొలిప్రేమలో వేసిన తాజ్ మహల్ సెట్ కాన్సెప్ట్ ని ఐదేళ్ళ క్రితం పవన్ కి చెప్పాను. తొలిప్రేమలో పవనే తాజ్ మహల్ సెట్ వెయ్యమన్నారు. నిర్మాతలు ఖర్చు ఎక్కువ అవుతుందని సంకోచిస్తుంటే, సినిమా ఫ్లాప్ అయితే ఆ సెట్ కి అయ్యే డబ్బు తను ఇస్తామని చెప్పి ఆ సెట్ వేయించాడు. అప్పటి నుంచి నేను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నేనీ స్థాయిలో ఉన్నానంటే అది పవన్ కళ్యాణ్ వల్లే అని’ అన్నాడు.