థియేటర్లు మూతబడటంతో కొన్ని తెలుగు సినిమాలు ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘వి, నిశ్శబ్దం’ లాంటి సినిమాలు విడుదలకాగా ఇంకొన్ని చిత్రాలు రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నాయి. చివరి దశ పనుల్లో ఉన్న ఇంకొన్ని చిత్రాలు కూడ ఓటీటీ వేదిక మీదకే ఎక్కాలని చూస్తున్నాయి. వాటి జాబితాలో అల్లరి నరేష్ చేసిన ‘నాంది’ కూడ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా పనులన్నీ పూర్తికావడంతో ఓటీటీ విడుదలకే వెళ్లాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.
మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో కొంత సమయం తీసుకున్న నరేష్ ఈ చిత్రానికి సైన్ చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలతోనే సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. నరేష్ గతంలో ‘నేను, గమ్యం’ లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసి ఉండటంతో ఈ సినిమా కూడ ఆ తరహాలోనే వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శిలు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు.