యూత్ స్టార్ నితిన్ హీరోగా మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ ల కాంబోలో వచ్చిన “హార్ట్ ఎటాక్” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ఆదా శర్మ. తనకి అది మొదటి సినిమాయే అయినా ఆ ఒక్క చిత్రం తోనే ఆ టైం లో కుర్ర కారును ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆదా ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా హీరోయిన్ గా అంతగా నిలదొక్కుకోలేకపోయింది. కానీ ఇప్పుడు చాలా కాలం బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించింది.
విప్ర దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “?”(క్వశ్చన్ మార్క్) అనే టైటిల్ ను పెట్టారు. దానికి సంబంధించిన పోస్టర్ తో విడుదల చేసి ఆదా ఇప్పుడు ఆసక్తి రేపింది. అయితే ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ గా ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె సంగీతం అందిస్తుండగా శ్రీ కృష్ణ క్రియేషన్స్ పేరిట గౌరీ కృష్ణ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కేవలం “?” అనే టైటిల్ ను పెట్టడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో చూడాలి.