కొన్ని దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అవి ఎంతలా అంటే ఓ హీరోయిన్ తెలియక చేసిన పని ఏకంగా లక్ష రూపాయలకు ఎసరు పెట్టేలా. అలా అని ఆమె ఏదో పెద్ద తప్పు చేసిందా అంటే.. కొన్ని మల్లెపూలు క్యారీ చేయడమే ఆమె చేసిన తప్పు. ఇంతకీ ఈ మల్లెపూల పంచాయితీ ఏమిటో తెలుసుకుందాం.
మలయాళీలకు ప్రధానమైన ఓనమ్ పండుగ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనమ్ వేడుకలు నిర్వహించారు. దీనిలో పాల్గొనేందుకు మలయాళ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ తన హ్యాండ్ బ్యాగ్‌లో కొన్ని మల్లెపూలు ఉండటంతో మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆమెను ఆపారు. ఆ దేశంలో బయో సెక్యూరిటీ చట్టాల ప్రకారం పండ్లు, విత్తనాలు, పూలు తీసుకెళ్లడం నిషేధం. అయితే, తనకు తెలియక జరిగిన తప్పు అని ఆమె చెప్పినా, అక్కడి అధికారులు ఆమెకు రూ.1.14 లక్షల జరిమానా విధించారు.
చేసేది ఏమీ లేక ఆమె ఆ జరిమానా చెల్లించినట్లు నవ్య నాయర్ తెలిపారు. ఇలా మల్లెపూలు లక్షకు ఎసరు పెడతాయని తాను అనుకోలేదని ఆమె తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.