ప్రముఖ హాస్య నటుడు ప్రియదర్శి ఇటీవలే ప్రభాస్, రాధాకృష్ణల సినిమా షూటింగ్ కోసం కొన్ని రోజుల క్రితం జార్జియా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి షెడ్యూల్ పూర్తికావడంతో టీమ్ మొత్తం ఇండియా చేరుకున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశాల నుండి ఇండియాకు వచ్చే ప్రయాణీకులకు విమానాశ్రయంలో ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అనంతరం వారంతా ఇళ్లకు చేరుకున్నాక 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వారి సూచన మేరకే ప్రియదర్శి 14 రోజుల వరకు ఇంటికే పరిమితమవ్వాలని తనకు తానుగా నిర్ణయం తీసుకున్నారు. తన సామాజిక భాద్యతగా ఇతరుల ఆరోగ్యం దృష్ట్యా ఈ డెసిషన్ తీసుకున్నట్టు ప్రియదర్శి తెలిపారు. ఇతర స్టార్లు సైతం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. హీరో మంచు మనోజ్ అయితే తన నివాసం ఇంటి చుట్టుపక్కల ఉండేవారికి తన భాద్యతగా శానిటైజర్స్, మాస్కులను పంచుతున్నారు.