ప్రతి సినిమాతోనూ తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించే అల్లరి నరేష్ ఈ సారి 3డిలో నవ్వించడానికి ‘యాక్షన్ 3డి’ తో సిద్దమవుతున్నాడు. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా 3డిలో తెరకెక్కించిన కామెడీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా జూన్ మొదటి వారంలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా అల్లరి నరేష్ ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెడీ సినిమాని 3డిలో తీస్తే ఎంతవరకూ సెట్ అవుతుంది? అలాగే తెలుగులోనే కాక తమిళ్లో ఏమేమి సినిమాలు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే ‘ ఒకప్పుడు చార్లీ చాప్లిన్ మూకీలో నవ్వించారు, ఆ తర్వాత మాటలతో నవ్వించారు. మనకు అందుబాటులో ఉండే ఏ కొత్త టెక్నిక్స్ ని ఐనా వాడుకోవచ్చు అందులో తప్పేమీ లేదు. 3డి అంటే ఒక్క యాక్షన్ సినిమాలే కాదు, కామెడీ సినిమాని కూడా 3డిలో చాలా బాగా చూపించవచ్చు. మా సినిమానే దానికో చక్కని ఉదాహరణ. అలాగే ప్రస్తుతం తమిళ్లో 10 కథలు సిద్దంగా ఉన్నాయి కానీ ఇప్పుడు చేసేంత సమయం లేదు. వచ్చే సంవత్సరం లోపు 6 సినిమాలు పూర్తి చెయ్యాలి. అవన్నీ అయిన తర్వాతే తమిళ్లో నటించాలనుకొంటున్నానని’ అల్లరి నరేష్ అన్నాడు.
అల్లరి నరేష్ తో పాటు రాజు సుందరం, వైభవ్, శ్యామ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని, షీన, రీతు బర్మేచ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అనీల్ సుంకర దర్శకనిర్మాతగా తీసిన ఈ సినిమాకి బప్ప – బప్పి లహరి సంగీతాన్ని అందించారు.