తమిళ స్టార్ ఇలయతలపతి విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘తలైవా’. ఈ సినిమాని తెలుగులో ‘అన్న’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్ర తమిళ, తెలుగు వెర్షన్ లను ఒకే రోజు అనగా ఆగష్టు 9న సుమారు 3000 థియేటర్లలో విడుదల చేయనున్నారు. ‘నాన్న’, ‘శివతాండవం’ సినిమాలకు దర్శకత్వం వహించిన ఎఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని 3కె ఎంటర్టైన్మెంట్ సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి. కాశీ విశ్వనాథం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. విజయ్ హీరోగా వచ్చిన ‘తుపాకి’ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ‘అన్న’ సినిమాకి కూడా క్రేజ్ బాగుంది.
తమిళంలో అయితే ఈ సినిమా రజినీ కాంత్ రికార్డుల్ని తిరగరాస్తుందని డిక్లేర్ చేసారు. అమలా పాల్ హీరోయిన్, సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. తమిళంలో విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగష్టు 4, 5 తేదీల్లో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ఆడియోని అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.