2026 సంక్రాంతికి విడుదల కానున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా మారి డైరెక్ట్ చేస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని తొలి పాట ‘భీమవరం బల్మా’ ను భీమవరంలో గ్రాండ్ రిలీజ్ చేశారు. ఎడ్ల బండిపై వేదికకు వచ్చిన నవీన్ ఎంట్రీ మరియు స్టేజ్‌పై మీనాక్షితో చేసిన డ్యాన్స్ ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
‘భీమవరం బల్మా’ పాటతో నవీన్ మొదటిసారి గాయకుడిగా మారడం విశేషం. మిక్కీ జె మేయర్ మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీకలిసి పాటకు మంచి రెస్పాన్స్ తెచ్చాయి. నవీన్-మీనాక్షి జోడీ డ్యాన్స్ మరియు ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. గాయని నూతన మోహన్ కూడా ఈ పాటలో అద్భుతంగా పాడారు.
ఇక ఈ వేడుకలో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. షూటింగ్లో గాయాల కారణంగా ఎదుర్కొన్న విరామాన్ని, అభిమానుల ప్రేమతో తిరిగి సెట్‌కి వచ్చిన విషయాన్ని పంచుకున్నారు. ఈసారి సంక్రాంతికి పక్కా ఎంటర్టైనర్గా ‘అనగనగా ఒక రాజు’ను అందిస్తున్నామని తెలిపారు. మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమా తీరా ప్రేక్షకుల్ని నవ్వించే పండుగ మూవీ అవుతుందని చెప్పింది. జనవరి 14న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై టీమ్ విశ్వాసం వ్యక్తం చేసింది.


