టాలీవుడ్లో తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’ రిలీజ్‌కు ముందే పలు అంతర్జాతీయ వేడుకల్లో 46 అవార్డులు అందుకుంది. విక్రాంత్ రుద్ర తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ రామరాజు లీడ్ పాత్రలో నటించగా ఈ సినిమా కథ తెలంగాణకు చెందిన నాగులయ్య అనే కబడ్డీ ఆటగాడి జీవితకథ ఆధారంగా రూపొందించారు. ఆగస్టు నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇక ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌పై అర్జున్ చక్రవర్తి చిత్రం నవంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కావడంతో ఈ సినిమాకు మరింత ఆదరణ దక్కుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
సిజా రోజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్ లంకలపల్లి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. విఘ్నేష్ భాస్కరన్ సంగీతం అందించిన ఈ సినిమా రెండు ఓటీటీల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.


