విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ
– డైరెక్టర్ సంజీవ్ రెడ్డితో నా జర్నీకి దాదాపు 10 ఏళ్లు. “లేడీస్ అండ్ జెంటిల్మెన్”, “ఏబీసీడీ”, “అహ నా పెళ్లంట” తర్వాత మేము “సంతాన ప్రాప్తిరస్తు” చేశాం. ఈ సినిమా స్క్రిప్ట్‌ను సంజీవ్ అద్భుతంగా తెరకెక్కించాడు. 56 రోజుల్లో షూటింగ్ పూర్తయింది.
– కొంతమంది హీరోలు ఇమేజ్ కారణంగా కథను తిరస్కరించారు. విక్రాంత్‌తో కథకు న్యాయం జరిగింది. మేల్ ఫెర్టిలిటీ నేపథ్యమైనా సినిమా ఫుల్ ఎంటర్టైనర్. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం లాంటి కాస్టింగ్ హైలైట్. “సామజవరగమన” తర్వాత మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
– సినిమా ఫెర్టిలిటీ సమస్యపై సానుకూల సందేశం ఇస్తుంది. మొదట టైటిల్‌పై సందేహాలు ఉన్నా, ఇప్పుడు అందరికీ నచ్చింది. ఈ సమస్యను సమాజం ఓపెన్‌గా చర్చించాల్సిన సమయం వచ్చింది. సినిమా సక్సెస్ అయితే “సంతాన ప్రాప్తిరస్తు 2” కూడా ప్లాన్ చేస్తున్నాం.
– మ్యూజిక్ హిట్ అయింది. ట్రైలర్ కూడా ట్రెండ్ అవుతోంది. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సినిమా ఇండియాలో 300 థియేటర్లలో, యూఎస్‌లో 200 లొకేషన్లలో రిలీజ్ అవుతోంది.
నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..
– ఐటీ సెక్టార్ నుంచి వచ్చి “సంతాన ప్రాప్తిరస్తు”తో నిర్మాతగా మారడం ఆనందంగా ఉంది. సినిమా ఐటీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో యువతకు దగ్గరగా ఉంటుంది. సెన్సిటివ్ ఇష్యూను సెన్సిబుల్‌గా చూపించాం.
– మా “ఫ్రెండ్లీ వెల్ఫేర్” ఎన్జీవో ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదే ఆలోచనతో ఈ సినిమాను చేశాం. చిన్నదైనా కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంది. మీడియా, ప్రేక్షకుల మద్దతుతో ఇలాంటి మంచి చిత్రాలు ఇంకా చేయాలనుకుంటున్నాం.


