సమీక్ష : థ్యాంక్ యు డియర్ – స్లోగా సాగే రొమాంటిక్ డ్రామా

సమీక్ష : థ్యాంక్ యు డియర్ – స్లోగా సాగే రొమాంటిక్ డ్రామా

Published on Aug 1, 2025 9:49 PM IST

Thank-you-dear

విడుదల తేదీ : ఆగస్టు 01, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : హెబ్బా పటేల్, ధనుష్ రఘుముద్రి, రేఖా నిరోష, చందు పప్పు, రవి ప్రకాష్ తదితరులు
దర్శకత్వం : తోట శ్రీకాంత్ కుమార్
నిర్మాత : పప్పు బాలాజీ రెడ్డి
సంగీతం : సుభాష్ ఆనంద్
సినిమాటోగ్రఫీ : పి.ఎల్.కె.రెడ్డి
ఎడిటింగ్ : రాఘవేంద్ర పెబ్బెటి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

హెబ్బా పటేల్, ధనుష్ రఘుముద్రి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘థ్యాంక్ యు డియర్’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

తాను ఎలాగైనా సినిమా డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో సత్యం(ధనుష్ రఘుముద్రి) ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే ఓ రోజు ముఖానికి ముసుగు వేసుకున్న ప్రియ(హెబ్బా పటేల్)ని చూసి ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేయడంతో ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో నగరంలో జరిగే వరుస హత్యల వెనకాల ఓ అమ్మాయి ఉందని పోలీసులు చెబుతారు. ప్రేమవివాహం చేసుకున్న సత్యం-ప్రియ జీవితంలో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఈ ఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది.? ఈ ఘటనతో సత్యం-ప్రియ ఏదైనా సమస్యలో ఇరుక్కుంటారా..? ఇంతకీ వరుస హత్యలు చేస్తున్నది ఎవరు..? ఆ హత్యల వెనకాల ఉన్నది ఎవరు..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

రొమాంటిక్ సినిమాల్లో సోషల్ మెసేజ్ ఇవ్వడం అనేది మంచి ప్రయత్నం. సినిమా డైరెక్టర్ అవ్వాలనే లక్షం కోసం తపించే సత్యం పాత్రలో ధనుష్ రఘుముద్రి బాగా నటించాడు. ఇక హెబ్బా పటేల్ కూడా తనకు ఉన్న పాత్రను బాగానే చేసింది. మరో ముఖ్య పాత్రలో రేఖా నిరోష ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా ఈ చిత్ర బీజీఎం నిలిచింది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఓ పాట కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే సోషల్ అవేర్నెస్ మెసేజ్ బాగుంది. దాంతో పాటు మరో సామాజిక అంశంపై కూడా తీసుకున్న పాయింట్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి సింపుల్ కథలను ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కేవలం లవ్ ట్రాక్ పైనే ఫోకస్ చేయడం ప్రేక్షకులను మెప్పించదు. ఆసక్తికర సన్నివేశాలు ఫస్ట్ హాఫ్‌లో లేకపోవడం మైనస్. ఇక నటన పరంగా కూడా ఇందులో నటీనటులు ఎక్కువ పర్ఫార్మ్ చేసేందుకు స్కోప్ లేకపోవడం మైనస్.

ఈ సినిమాకు మరో మేజర్ డ్రాబ్యాక్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్‌లో కేవలం లవ్ ట్రాక్ ఉండటంతో ప్రేక్షకులు చాలా బోరింగ్ ఫీల్ అవుతారు. ఇక సెకండాఫ్‌లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు ఉన్నా, వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. సెకండాఫ్‌లో వచ్చే సోషల్ మెసేజ్‌లు బాగున్నా, వాటి కోసం ఇంత డ్రామా అనవసరం అనిపిస్తుంది.

చెప్పాలనుకున్న పాయింట్‌ను దర్శకుడు అటు ఇటు తిప్పుతూ ప్రెజెంట్ చేయడం ప్రేక్షకులను మెప్పించదు. ఇక క్లైమాక్స్‌ను కూడా సరిగా ట్రీట్ చేయలేదనే భావన ఆడియన్స్‌కు కలుగుతుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమా కథలో సోషల్ మెసేజ్ ఇవ్వాలనే ఆలోచన బాగున్నా, దానిని దర్శకుడు తోట శ్రీకాంత్ కుమార్ ఇంకా బెటర్‌గా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. కథను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఫ్లో తప్పినట్లుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకు టెక్నికల్‌గా ప్లస్ అయింది సంగీతం. ముఖ్యంగా బీజీఎం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా ఇంకా బెటర్‌గా చేసి ఉండాల్సింది. చాలా సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘థ్యాంక్ యు డియర్’ చిత్రం ఓ సోషల్ మెసేజ్‌తో కూడిన రొమాంటిక్ డ్రామాగా నిలిచింది. నటీనటుల పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే సోషల్ మెసేజ్‌లు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్. స్లో గా సాగే స్క్రీన్ ప్లే, బోరింగ్ సీన్స్, కథలో బలం లేకపోవడం వంటివి ఈ చిత్రానికి మైనస్. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారు కొత్తదనం లేదా ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువగా ఆశించకపోవడం మంచిది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు