‘జెంటిల్ మెన్’, ‘ఒకే ఒక్కడు’, ‘హనుమాన్ జంక్షన్’ మొదలైన సూపర్ హిట్ సినిమాలతో తెలుగు వారికి బాగా పరిచయమున్న యాక్షన్ కింగ్ అర్జున్ తన కొత్త సినిమాకి ‘జై హింద్ 2’ అనే టైటిల్ ని ఖరారు చేసాడు. ఈ సినిమా లాంచింగ్ ప్రెస్ మీట్ లగ్జరీకి మారు పేరుగా చెప్పుకునే పార్క్ హయత్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జగపతి బాబు, డా. టి సుబ్బరామి రెడ్డి, సుర్వీన్ చావ్లా తదితరులు హాజరయ్యారు.
ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలోని సమస్యలను ఆధారంగా చేసుకొని ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని తీయనున్నారు. అర్జున్ ఈ సినిమాని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాంకి అంకితం ఇస్తున్నానని తెలిపాడు. ‘ ఈ సినిమాని డా అబ్దుల్ కలాం గారికి అంకితం ఇస్తున్నాను. ఆయన రాసిన ఓ ఆర్టికల్ చూసి ఈ సినిమా చేస్తున్నానని’ అర్జున్ అన్నాడు.
ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ భాధ్యతలతో పాటు నిర్మాణ భాద్యత కూడా అర్జున్ తీసుకోవడం చెప్పదగిన విషయం.
ఈ కార్యక్రమంలో జగపతిబాబు కొన్ని ఆసక్తికరమైన స్టేట్ మెంట్స్ చేసాడు. ‘ ప్రస్తుత రోజుల్లో రియల్ ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. సాయంత్రమైతే కొన్ని పెగ్స్ కోసం వచ్చే ఫ్రెండ్స్ మరుసటి రోజు ఉదయానికి అన్నీ మర్చిపోతారు. కానీ అర్జున్ అలా కాదు. అతను తాగినా, తాగకపోయినా ఫ్రెండ్స్ ని మాత్రం మరచిపోడని’ జగపతి బాబు అన్నాడు.